కొబ్బరికాయ కొడితే కోరికలు తీర్చే వినాయకుడి గుడి ఎక్కడుందో తెలుసా..?

-

ఏదైనా పని ప్రారంభించేటప్పుడు అందులో ఎలాంటి విఘ్నాలు రాకూడదని విఘ్నేశ్వరుడికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. స్వచ్ఛమైన మనసుతో ఆ లంబోదరుడికి ఓ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మన దేశంలో వినాయకుడి ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని కోవెలలకు ప్రత్యేకత ఉంది. ఒకచోట వినాయకుడు బావిలో వెలిశాడు. మరోచోట వినాయకుడి ప్రతిమ పాలు తాగుతుంది. ఇలా కొన్ని చోట్ల గణపతి దేవాలయాలకు ప్రత్యేకత ఉంది. అలాంటి ఓ ఆలయం ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఉంది. అదే అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. మరి ఈ ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..?

 

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి విఘ్నేశ్వరుడి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. ఇక్కడ ఆ గణనాథుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి.ఈ గణపయ్యకు ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరతాయట. ఇదే ఈ ఆలయ విశిష్టత. వినాయక చవితి సంధర్భంగా అయినవిల్లి వినాయక ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.


కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం పొందింది. ఈ ఆలయం పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, ప్రకృతి రమణీయతల మధ్య కొలువుదీరింది. ఏకదంతుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. కొబ్బరికాయ కొడితే కోరికలు తీరుస్తాడు కాబట్టి ఈ వినాయకుడిని నారికేళ వినాయకుడు అని అంటారు.

దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతుంటారు. స్వయంభువు వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని పురాణాలు చెబుతున్నాయి.ఇది కృతయుగానికి చెందిన ఆలయమని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెబుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుపుతుండగా..వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఉంది. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి, గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భవాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.

సువిశాలమైన ఆవరణలో ఎతైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా దేవాలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి. అయితే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. రెండు గోపురాలతో చూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.


అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో ప్రతినెల కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిథులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోరికలు తీరిన వెంటనే భక్తులు మళ్లీ వారి మొక్కులు తీర్చుకుంటారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version