అయిపోయింది.. అంతా అయిపోయింది.. కోట్ల మంది భారతీయులు పెట్టుకున్న ఆశ ఆవిరైపోయింది. పారిస్ ఒలింపిక్స్లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) తిరస్కరించింది. ఇప్పటికే మూడు సార్లు తీర్పును వాయిదా వేయగా, తుది తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులకు నిరాశ పరుస్తూ ఆ పిటిషన్ ను కొట్టివేసింది.
ఈ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష స్పందిస్తూ.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కాస్ తిరస్కరించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. తనతో పాటే కోట్ల మంది భారతీయులకు నిరాశ మిగిల్చిందని వాపోయారు. సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేశ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ కాస్ ఆగస్టు 14న తీర్పును ఇచ్చిందని పీటీ ఉష ఓ ప్రకటనలో పేర్కొన్నారు.