అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇండియా విజయంతో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 159 రన్స్ లక్ష్యాన్ని ఇండియా.. 17.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.జితేశ్ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఇండియా బోణీ చేసింది.
అయితే.. ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడిన రింకు సింగ్…. ఇటీవల ధోనీని కలిసిన విషయాన్ని, అతనితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నాడు. “నెంబర్ 6 లో బ్యాటింగ్ చేయడం….మ్యాచ్ లను ముగించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫినిషర్ బాధ్యత పట్ల సంతోషంగా ఉన్నాను. తీవ్రమైన చలిలో ఆటను ఆస్వాదించాను. ఇటీవల నేను ధోని భాయ్ తో మాట్లాడాను. బంతిని బట్టి ఆడాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. నేను అదే చేస్తున్నాను. బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఆలోచించను. బంతికి తగ్గట్లు మాత్రమే రియాక్ట్ అవుతాను” అని రింకూసింగ్ చెప్పుకొచ్చాడు.