గుండెపోటు.. పదేళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. అప్పటిదాకా ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా యువకుల్లో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. దీనికి జీవనశైలే కారణమని వైద్యులు చెబుతున్నారు. తాజాగా గుండెపోటుతో స్కూల్ బస్సులోనే ఓ 12 ఏళ్ల బాలుడు కుప్పకూలిపోయాడు.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా కేంద్రానికి చెందిన మనీష్ జాదవ్(12) ఎతవాహ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ నుంచి ఇంటికి స్కూల్ బస్సులో తిరిగి వస్తుండగా జాదవ్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. స్కూల్ సిబ్బందికి సమాచారం అందించాడు. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. బాలుడు గుండెపోటుకు గురైనట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. జాదవ్‌కు పోస్టుమార్టం చేయొద్దని అతని తల్లిదండ్రులు వైద్యులకు విజ్ఞప్తి చేశారు.