ఫస్ట్ కాజ్ : నేడు అనగా జూన్ ఐదు అనగా 2022..ప్రపంచ పర్యావరణ దినోత్సవం
– మంచీ చెడూ
ప్రకృతి గతిలో భాగాలు –
వాటిని విడదీయడం నేరం
కలిపి ఉండనీయండి ఏం కాదు
అవిభక్తాలు అని అంటారే అంటే
విడదీసేందుకు కూడా సాధ్యం కానివి అని
అర్థం.. ఆ విధంగా ప్రకృతిలో మరియు మీలో
మీలో దాగిన ప్రకృతి గుణంలో లేదా సంబంధిత
లక్షణంలో ఉన్న మంచి చెడులు అలానే ఉండనీయండి
ప్రకృతికి చెందిన ధర్మం కాలం నిర్ణయిస్తుంది
మనిషి చేయాల్సిన కర్తవ్యం కూడా కాలమే నిర్ణయించాలని అనుకుంటుంది..పర్యావరణ దినోత్సవాన మీలో ఏ గొప్ప మార్పు వస్తుందో అని పాలకులు..గుడ్లప్పగించి చూడడం తరువాత మొక్కలు నాటుట చెట్లను పెంచుట అని పలు కార్యక్రమాలు చెప్పి డబ్బులు దండుకోవడం అత్యంత సహజాతి సహజం. కనుక తెలంగాణ వాకిట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో జరగబోయే లేదా జరుగుతున్న యాభై వేల కోట్ల రూపాయల స్కాంను అడ్డుకోండి చాలు. ప్రకృతి కన్నా ముందు ప్రజాధనం రక్షించుకుని తీరడం ఓ బాధ్యత అని గుర్తించండి చాలు. ఈ వికృతిని ఆపితే మీరు మీ చుట్టూ ఉన్న పర్యావరణానికి ముఖ్యంగా ఆరోగ్య కర సమాజానికి ముఖ్యంగా అవినీతిలో లేని సమాజానికి ఎంతో కొంత సాయం చేసినవారే అవుతారు!
మంచి గతమున కొంచెమే అని అన్నారు గురజాడ ! ఆ విధంగా కొంచెం మంచి ఉన్నా దానిని వ్యాప్తి చెందించే గుణం కూడా ఒకటి తప్పక మనలో ఉండాలి. ఆ విధంగా ఈ రోజు మనం కొంచెం మట్టీ కొంచెం నీరు కొంచెం శ్రమ కొద్దిగా ఆసక్తి కలిపి ఉంచగలిగితే ఓ మొక్క.. కలిపి ఉంచితే అదే మీ భవిత అని కూడా రాయొచ్చు. భవిష్యత్తు రేఖలు దేవుడు మార్చడు. కాలం మార్చడం జరగదు.
కనుక కరిగిపోయిన కాలంలో నమోదుకు నోచుకున్న మరియు నోచుకోని తప్పిదాలను దిద్దుకుంటే చాలు. అన్నీ సవ్యంగా సాగిపోతాయి. ప్రకృతి దీవెనలు అందుకుంటూ వెళ్లడమే భవిష్యత్ రేఖలను దిద్దుకోవడం. దిద్దుకోవడం అన్నదే మార్పు. ఆ మార్పు జీవగతం అవ్వాలి. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ల పేరిట డ్రామాలు ఉండవు. ఆ మార్పు ఆత్మగతం కావాలి అప్పుడు పాలకులు 1200 కోట్ల ఒక్క శాతం పర్యావరణ వృద్ధి కోసం వెచ్చించాల్సిన పని కూడా ఉండదు.
పాలకులు మనం తప్పులు చేస్తే చూస్తారు. వాళ్లు తప్పులు చేస్తూ పక్కనోడు చూడకుండా జాగ్రత్త పడతారు. వేల ఎకరాలు డీ ఫారెస్టేషన్ చేసిన, అడవులు కొట్టేసినా మనం అడిగామా ! ఇప్పుడవే కదా టౌన్ షిప్పులు. అవే కదా వికృతానికి అందమయిన ఆకృతులు. ఇవన్నీ మనం భరించాలి. లేదా ప్రశ్నించాలి. మనకు ప్రశ్నించడం చేతగాదు..అందుకే ప్రకృతే ప్రశ్నార్థకం అయిన జీవితాలను అందించి వెళ్లడం ఖాయం.
వానల్లేవు సకాలంలో వానల్లేవు అని ఏడ్చిన వాళ్లకు, వానొస్తే నవ్విన వాళ్లకు, వాన ఉద్ధృతిని తట్టుకుని నీళ్లను దాచుకున్న వాళ్లు ఇలా చాలా మంది మన మధ్యే ఉన్నారు. ప్రకృతి గాడి తప్పిందని ఏడ్చే కన్నా.. మనమే గాడి తప్పించాం అన్న స్పృహ ఒకటి మనకు ఉంటే చాలు. ఇందక చెప్పానే భవిష్యత్ రేఖలు ఎవరికి వారే దిద్దుకోవచ్చు. సంబంధిత నడవడిని మార్చుకోవచ్చు.