పాకిస్థాన్ ప్రధాని నివాసం సురక్షితం కాదని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్ చౌదరి అన్నారు. ఆయన నివాసంలో మాట్లాడుకున్న సంభాషణలు లీక్ అయ్యాయని తెలిపారు. ప్రధాని సహా కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్ ఒకటి డార్క్ వెబ్‌లో 3.50 లక్షల డాలర్లకు విక్రయానికి ఉందని బాంబు పేల్చారు.
పాకిస్థాన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు మొత్తం లండన్ నుంచి తీసుకుంటున్నట్లు ఈ ఆడియో క్లిప్‌లోని సంభాషణలను బట్టి అర్థమవుతుందని అన్నారు. సుదీర్ఘ ఆడియో క్లిప్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ముస్లిం లీగ్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, న్యాయశాఖ మంత్రి ఆజమ్ తరార్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా, నేషనల్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అయాజ్ సిద్ధీఖీ, మునుపటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంభాషణలు ఉన్నట్లు ఫవాద్ తెలిపారు.
ముఖాముఖి సంభాషణే బయటకు వచ్చిందంటే ప్రధాని నివాసంలో నిఘా పరికరాలేవో ఉన్నట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో రహస్యంగా జరిగే సమావేశంలోని సంభాషణలనూ అర కిలోమీటరు దూరం నుంచి స్పష్టంగా వినగలిగే అధునాతన సాంకేతికతను వాడడం ద్వారా దాదాపు ఉన్నతస్థాయి కార్యాలయాలన్నింటిపై కొన్ని దేశాలు నిఘా విధించాయని వార్తా కథనం ఒకటి వెల్లడించింది. ఆడియో లీక్ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించింది.