మునుగోడు ఉపఎన్నిక ముందు బీజేపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇవాళ ఉదయం దాసోజు శ్రవణ్ రాజీనామా చేయగా, ఆ తర్వాత కొన్ని గంటలకే శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామి గౌడ్ ఆరోపించారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.
మరోవైపు పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మళ్లీ సొంతగూటికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ఆ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని.. తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు.