ఆత్మ స్తుతి పర నింద అన్నవి రెండు ఉంటాయి. ఈ రెండూ పద్ధతిగా ఉంటే మంచివే ! పద్ధతి దాటి ఉంటే చెడ్డవి ! మరి! మహానాడులో తొడలు కొట్టడం, మీసాలు మెలెయ్యడం.. అన్నవి కూడా మంచివేనా ! అంటే అవన్నీ భావోద్వేగంలో భాగంగా చేశారని సర్దుకుపోవాలి. గతంలో కొన్ని లైవ్ డిబెట్లలో జరిగిన సంభాషణల ఆధారంగా వాళ్ల కోపం కానీ ఆవేశం కానీ మరోసారి ప్రకటించారని భావించి సర్దుకుపోవాలి. ఇంతకూ తెలుగుదేశం పార్టీలో మంచి మార్పులన్నవి ఎప్పుడు వస్తాయి.? ఇదే ప్రశ్న అందరినీ వెన్నాడుతోంది. ఎందుకంటే చాలా వరకూ లోకేశ్ నాయకత్వాన్ని పెద్దగా ఎవ్వరూ అంగీకరించరు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనే ఫ్యూచర్ లీడర్ అంటున్నారు.
పార్టీ బాధ్యతలను యువ నాయకులు అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు అప్పగిస్తే బాగుంటుంది అన్న భావన కూడా ఎప్పటి నుంచో ఉంది. అచ్చెన్నను తప్పిస్తారా లేదా అన్నది కూడా వారి అంతర్గత విషయం. అయితే ఇప్పటికీ కళా వర్గానికి, కింజరాపు వర్గానికి ఉన్న భేదాలు మాత్రం తొలగిపోలేదు. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు కూడా ఇరు వర్గాల నుంచి జరగడం లేదు. కళా వెంకట్రావు నియోజకవర్గంలో కూడా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పటి నుంచో ఎర్రన్న వర్గం పనిచేస్తుంది. కనుక ఆయన స్థాయిలో కొడుకును ప్రొజెక్ట్ చేయాలనుకున్నా జనం అతడ్ని ఆదరిస్తారో లేదో అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
ఇదే సందర్భంలో మహానాడులో అంతా చంద్రబాబును పొగిడేందుకు, వైసీపీని తిట్టేందుకు ఎక్కువ సమయం కేటాయించారు.
చింతకాయల అయ్యన్న పాత్రుడే కాదు ఆయన కొడుకు విజయ్ పాత్రుడు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇవన్నీ కూడా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తాయేమో కానీ కొత్త జోష్ నింపుతాయేమో కానీ ప్రజలకు వీటి నుంచి పొందే ప్రయోజనం ఏమీ ఉండదు.