ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు ప్రాణాలు తీస్తున్నాయంటూ టీడీపీ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. కిల్లర్ జే బ్రాండ్స్ పేరిట ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభించింది టీడీపీ. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ఏపీలో మద్యం పాలసీ పేదల బతుకులను చిధ్రం చేస్తున్నాయని.. దశల వారీ మద్య నిషేధం హామీని జగన్ గాల్లో కలిపేశారని ఫైర్ అయ్యారు.
మద్య నిషేధం.. నియంత్రణను పక్కన పెట్టి ప్రభుత్వమే మద్యం తయారీ మొదలుకుని అమ్మకాల వరకు జగన్ ప్రభుత్వమే నడుపుతోందన్నారు. నాసిరకమైన జే బ్రాండ్లను ప్రజలపై రుద్దుతున్నారు… సాయంత్రానికి మద్యం సొమ్ము తాడేపల్లి ప్యాలెస్సుకు చేరుతోందని వెల్లడించారు.50 రకాలకు పైగా బ్రాండ్లని తెర పైకి తెచ్చారు… జే బ్రాండ్ల ద్వారా సరపరా అయ్యే మద్యం ప్రాణాంతకంగా ఉందని పేర్కొన్నారు.
జంగారెడ్డి గూడెం నాటుసారా మరణాలను సహజ మరణాలంటూ చెబుతున్నారు… సహజ మరణాలైతే జంగారెడ్డి గూడెం మరణాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు..?అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు మద్యం.. నాటుసారా ప్రధాన ఆదాయ వనరుగా మారిందని.. ప్రభుత్వ మద్యం పాలసీ.. మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీ, మద్యం మరణాలు వంటి వివరాలను వెబ్ సైటులో పొందుపరుస్తామని ప్రకటన చేశారు. ప్రజలు ఈ డిజిటల్ క్యాంపెయినులో భాగస్వాములు కావాలని కోరారు.