పార్టీలోనే ఉంటారు కానీ ఉన్నట్టుండి సైలెంట్ అవుతారు. సంక్షోభ సమయంలో టీడీపీలోని ఇతర నాయకులు ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం కనపడరు. రాజకీయాలలో ఎప్పుడూ ఈయన లెక్కలు ఈయనకంటూ ప్రత్యేకంగా ఉంటాయి..ఇక ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్న ఈ సీనియర్ రెండు సపరేట్ రూట్లను ఎంచుకున్నారట..కుదిరితే ఇటు లేకపోతే అంటూ అధికారంలో ఉన్న రెండు పార్టీలకు టచ్ లో ఉన్నారట.
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 23 మందిలో గంటా శ్రీనివాసరావు ఒకరు. మాజీ మంత్రి కూడా. .ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేవరకు పనిచేసిన ఆ లెక్కలు.. ఆ తర్వాతే ఎందుకో తేడా కొడుతున్నాయ్. అధికారపార్టీ వైసీపీలో చేరేందుకు శతవిధాలా ప్రయత్నించినా.. అవుతున్నట్టే కనిపిస్తుంది కానీ అక్కడ తలుపులు తెరుచుకోవు. గంటాకు అక్కడ ఎంట్రీ లేదన్నది కొందరి వాదన. కానీ.. వైసీపీలో చేరిక అనే అంశాన్ని లైవ్‌లో ఉంచడానికి గంటా అనుచరులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు.తాను టీడీపీలోనే ఉన్నానని ఈ మధ్య బహిరంగంగానే చెప్పారు గంటా.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి పార్టీ కార్యక్రమం నిర్వహించినా కనీసం విశాఖ వచ్చినా.. పార్టీ అధికారిక కార్యక్రమమే అయినా వెళ్లరు. మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ అలాగే ఉంటారు. టీడీపీ కార్యక్రమాలపై చర్చించరు. ప్రస్తుతం తెలుగుదేశానికి సంక్షోభ సమయం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రకే చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చివరికి సైలెంట్‌గా ఉండే అశోక్‌గజపతిరాజు కూడా విమర్శలు చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు మాత్రం ఉలకడు.. పలకడు.. పార్టీని ప్రొటెక్ట్ చేయడు అన్న కామెంట్స్ టీడీపీ వర్గాల్లో ఉందట. ఆ మధ్య రామతీర్థం ఘటనపై టీడీపీ పెద్ద ఉద్యమం చేసింది. అయినా గంటా వెళ్లలేదు. మాట్లాడలేదు.
వైసీపీ కాకపోతే బీజేపీ ఆప్షన్ ఎలాగూ ఉంది కదా తానెందుకు బయటపడాలి అని గంటా శ్రీనివాసరావు అనుకుంటున్నారా.. ఒకవేళ కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధపడితే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.. బీజేపీని బూచిగా చూపించి ఎవరితోనైనా బేరసారాలు కుదుర్చుకోవాలని చూస్తున్నారా? గంట ఎక్కడ మోగించాలన్న దానికోసం ఇప్పుడు వేసుకుంటున్న లెక్కలు ఒక పట్టాన కొలిక్కి రావడం లేదా.. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికే రెండేళ్లు దగ్గరపడుతోంది. గెలిపించిన జనాలతో పెద్దగా టచ్‌లో లేరు. గంటా ఎక్కడున్నారో జనాలు పట్టించుకోవడం లేదు.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటకెళ్లిపోయారు. ఇప్పుడు గంటా టీడీపీలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న ఆలోచనకు టీడీపీ నేతలు వచ్చేశారట. ఈ వీక్‌నెస్‌తో మాజీ మంత్రి కూడా ఆడేసుకుంటున్నారు. బీజేపీకి కూడా నేతలు కావాలి. కాషాయ శిబిరంలోని ఆ వీక్‌నెస్‌ను వాడేసుకుంటున్నారు. రాజకీయ నాయకులంటేనే అవకాశవాదులనే విమర్శలు ఉంటాయి. ఈ విషయంలో గంటా పచ్చి అవకాశవాదనే ఆరోపణలు బలంగానే వినిపిస్తుంటాయి. ఏ విషయం తేల్చరు. ఒకవేళ టీడీపీలోనే ఉంటానంటే వైసీపీకి టార్గెట్ అవుతారు. అందుకే అటు వెళ్లలేరు.. ఇక్కడ ఉండలేరు. ప్రస్తుతం అటూఇటు కాకుండా క్రాస్ రోడ్స్‌లో నిలుచున్నారు గంటా.