రాష్ట్ర మంత్రి కొడాలి నానిని, డీజీపీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందున నిన్నటి వేళ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి, అర్ధరాత్రి వేళ స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.దీంతో ఆయన ఎపిసోడ్ అయిపోందని అనుకునేందుకు వీల్లేదు.ఇంకా ఉంది అని చెప్పేందుకు మాత్రమే నిన్నటి వేళ పోలీసుల చర్య ఒకటి సంకేతంగా నిలుస్తోంది. దీంతో విజయవాడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చల్లబడింది.శీతల గాలుల నడుమ వేడెక్కిన రాజకీయం కాస్త మరో రూపం తీసుకోనుంది.
ఇక తమ అధినేత చంద్రబాబును ఏమన్నా అంటే ఊరుకోం అని బుద్ధా వెంకన్న అంటున్నారు.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా తమ అధినేతను ఏమన్నా ఊరుకోం అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను అంటున్నారు. అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండకూడదని వీళ్లేమయినా రూలింగ్ తీసుకువస్తున్నారా? లేదా ఇదొక కాలక్షేపం ఆటలా వీళ్లందరికీ ఉందా?
టీడీపీలో అయ్యన్న పాత్రుడి నోరుకు కానీ అనిత నోరుకు కానీ అడ్డూ అదుపు ఉండనే ఉండవు.ఇదే సమయంలో బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య లాంటి నేతలు వీరికి తోడు. తిట్లతోనే రాజకీయం చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారా వీళ్లంతా అంటే ఏమో చెప్పలేం కానీ సామాజిక సమస్యలపై వీరు మాట్లాడిందేమీ లేదని ఇవాళ తేలిపోయింది. అటు అయ్యన్న ఇటీవల ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్న మాటలపై దువ్వాడ రాయడానికి వీల్లేని భాషలో ఎటాక్ ఇచ్చారు. అసలీ ఘటనతో దువ్వాడకు అస్సలు ఏ సంబంధం లేకపోయినా కూడా అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి నోటికి వచ్చిందంతా అయ్యన్నను తిట్టి వార్తల్లో నిలిచారు.
అదృష్టం ఏంటంటే దువ్వాడ తిట్లు పెద్దగా ట్రోల్ కాలేదు.టీడీపీ కూడా కౌంటర్ ఎటాక్ ఇవ్వలేదు.ఎందుకని వీళ్లంతా ఇవాళ ఒకరినొకరు తిట్టుకుంటున్నారని? ఇవాళ ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. కానీ మన నాయకులు కరోనా కన్నా డేంజర్ గానే ఉన్నారు అని మరో మారు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.