ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించింది. ఇప్పుడిప్పుడే వైరస్ అదుపులోకి వస్తున్న క్రమంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు 200కు పైగా కేసులు నమోదు కాగా.. మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరణంలో పలు దేశాలు, రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంకీపాక్స్ వైరస్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పలు దేశాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల మంకీపాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒంటిపై దుద్దర్లు, రాషెస్ వచ్చిన అనుమానితులు వైద్యాధికారులను సంప్రదించాలని కోరింది. అనుమానితుల బ్లడ్ శాంపిళ్లను పూణెలోని ఎన్ఐవీకి పంపి టెస్టు చేస్తున్నట్లు పేర్కొంది.