తెలంగాణ రాజకీయం ఇప్పుడు మనుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన వేళ… అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా సమర సన్నాహాలు పూరిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సభ జరగగా… శనివారం టీఆర్ఎస్ సభ జరుగుతోంది. రేపు (ఆదివారం) బీజేపీ సభ జరగనుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో మునుగోడులోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభకు ఇంకో రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో అమిత్ షా శక్తి సామర్థ్యాలను ఆకాశానికి ఎత్తేస్తూ బీజేపీ తెలంగాణ శాఖ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోతో పాటు ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను పెట్టింది.
నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు.. కార్యకర్తలకు కర్తవ్యం గుర్తు చేసేందుకు.. ఉపఎన్నికలో విజయం దక్కేలా పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు.. తెలంగాణలో బీజేపీ అధికారం సాధించే దిశగా వ్యూహం రచించేందుకు మునుగోడు సమరభేరి సభకు అభినవ సర్దార్ అమిత్ షా వస్తున్నారంటూ సదరు పోస్ట్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. అంతేకాకుండా నయా నిజాం మెడలు వంచేందుకే అభినవ సర్దార్ రూపంలో అమిత్ షా తెలంగాణకు వస్తున్నారంటూ వీడియోలో తెలిపింది.