తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించగలరు కానీ అడ్డుకోలేరు : కేటీఆర్

-

కేంద్ర సర్కార్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్రప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేసినా తెలంగాణ ఐటీ రంగం గత ఎనిమిదేళ్లలో 3.2 రెట్లు వృద్ధి చెందిందని తెలిపారు. నిరుడు దేశంలో మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ లోనే వచ్చిందని గుర్తుచేశారు. సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా ఉందని చెప్పారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందని, పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయ పెరుగుదల తెలంగాణలోనే అధికమని కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినప్పటికీ అద్భుత వృద్ధి నమోదు అయిందన్న ఆయన…20 వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 1.6 మిలియన్ మందికి కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మించినట్లు వెల్లడించారు.

కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్యకళాశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంతంగా నిర్మించిందని… కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా పెండింగ్​లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో… కలలు కనడం… వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version