మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ(28) అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ మేరకు భర్త స్వామి ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు.
శనివారం రాత్రి మేడ్చల్ మల్కాజిరి జిల్లా శామీర్ పేట చెరువు నీటిలో భానుప్రియ (28), కుమార్తె దీక్ష(4) మృతదేహాలు లభ్యమయ్యాయి. వీళ్లను ములుగుకు చెందిన భానుప్రియ ఆమె పిల్లలేనని పోలీసులు గుర్తించారు. వేదాల్ష్ ఆనంద్ (5) మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో అక్కడి నుంచి వచ్చి శామీర్ పేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.