మోదీని మరోసారి ప్రధానిని చేయాలని రాష్ట్ర ప్రజలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందని, మజ్లిస్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయని అన్నారు.
మజ్లిస్‌కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదు. బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసుకువస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపోయాయి. కాంగ్రెస్ నేతలు తెలంగాణను దిల్లీ ఏటీఎంగా మార్చారు. మెదక్‌లో బీజేపీ ప్రత్యర్థులను మట్టి కరిపించాలి. మెదక్‌లో కమలం వికసించాలి. అని అమిత్ షా అన్నారు.
అయోధ్యలో రామ మందిరం కోసం మోదీ కృషి చేశారని అమిత్ షా తెలిపారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దేశంలో 400కు పైగా స్థానాల్లో భాజపాను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.