ప్రచారానికి వచ్చి ‘ చేయి’ దులుపుకుంటే సరిపోదమ్మా ! తలో ‘ చెయ్యి ‘ వెయ్యాల్సిందే ?

-

ఎవరికీ రాని కష్టం… మరెవరికీ రాని ఆర్థిక నష్టం తమకు మాత్రమే దుబ్బాక ఉప ఎన్నికల్లో రావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా లబో దిబో అంటూ, తమకు వచ్చిన ఆర్థిక కష్టాన్ని, నష్టాన్ని తలుచుకుని తలుచుకుని కుమిలి పోతున్నారట. అసలు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చిన ఆ బాధేంటో ఓసారి చదివేద్దాం !
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా క్రెడిట్ కొట్టేసి అధికారం దక్కించుకోవాల్సి ఉన్నా, కాంగ్రెస్ 2014 నుంచి ప్రతిపక్షంలోనే కూర్చోవడం తోపాటు, ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాయకులు అధికార పార్టీ టిఆర్ఎస్ వైపు వెళ్లిపోవడంతో, ఇప్పుడు కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం పక్కన పెడితే, అసలు పార్టీ ఉనికిలో ఉంటుందా లేదా అనేది ఆ పార్టీ నేతలను సందేహాలకు గురి చేస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే,  ఆకస్మాత్తుగా వచ్చిపడిన దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ సీనియర్లు అంతా రంగంలోకి దిగిపోయారు.
ఆయనను గెలిపిస్తేనే కాంగ్రెస్ సీనియర్ల పలుకుబడి అధిష్టానం దగ్గర పెరగడంతోపాటు, పార్టీ పదవులు వస్తాయని, అలాగే 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం తమ వైపు ఉంటుందని నమ్ముతోంది. అందుకే ఏదో రకంగా గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సీనియర్ నాయకులంతా ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ కాంగ్రెస్ సీనియర్లకు ఉచిత సలహాలతో కూడిన ఆజ్ఞ జారీ చేశారు. అదేంటయా అంటే..? మీరు ఉత్తి చేతులతో వచ్చి ప్రచారం చేస్తే సరిపోదని, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కి ఆర్థికంగా అండదండలు అందించాలని, ఎన్నికల ఖర్చు తలో కొంత భరించాలని అజ్ఞాలు సైతం జారీ చేయడంతో ఇప్పుడు సీనియర్లంతా లబోదిబోమంటున్నారు.
అసలే పార్టీ అధికారానికి దూరమై చాలా కాలం అయ్యింది. అధికారం లేక పోతే పదవులు తప్ప ఆర్థిక ప్రయోజనాలు ఉండవనే సంగతి ఠాకూర్ కు తెలియదా ? ఎవరికి వారే ప్రస్తుత ఖర్చులు భరించలేని స్థితిలో ఉంటే, ఇప్పుడు కొత్తగా ఎన్నికల ఖర్చు ఎందుకు భరించాలి అని వారు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారట. ఎక్కడైనా పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా బలహీనంగా ఉంటే, పార్టీ వారికి ఆర్థిక అండదండలు అందించాలి తప్ప, కష్టాల్లో ఉన్న నాయకులకు ఖర్చును అంటించడం ఏమిటని అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారట. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా ఎక్కడా  విమర్శించకుండా, తమ పరిస్థితిని తలుచుకుని తెగ బాధపడిపోతున్నారట.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news