ఈ ఏడాది వేసవికాలంలో తెలంగాణలో ఎండలు విపరీతంగా దంచి కొట్టాయి. వారం రోజుల నుంచి ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పిందనే చెప్పాలి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ దీవులను తాకిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జూన్ 05 నుంచి 15 తేదీలలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
గత ఏడాది కేరళకు జూన్ 11న నైరుతి రుతుపవనాలు వచ్చాయి. కానీ ఈ ఏడాది ఈ నెలఖారు వరకు రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ సారి నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. జూన్ 5-15 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొంత ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.