సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వేములవాడ రాజన్న ఆలయం, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్లు మంజూరు హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు మళ్లీ కొత్తగా కొండగట్టు అంజన్న పేరుతో సీఎం కేసీఆర్ దేవుళ్ళకే శఠగోపం పెడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెడితే తానే భాద్యత వహిస్తానన్నారు బండి సంజయ్. కెసిఆర్ కుటుంబ అవినీతికి మీటర్లు పెట్టామని.. మీ సంగతి చూస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని.. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కేసిఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుంచే చైనా బజార్లకు వస్తువులు వెళుతున్నాయని చెప్పారు బండి సంజయ్. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే ఎటుపోయాడని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించి 250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.