ఇటీవల ఓఆర్ఆర్ ను 30 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఐఆర్బి ఇన్ఫోస్ట్రక్చర్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్ ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్ లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలపై బిజెపి సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. టెండర్ల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సీబీఐ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు రఘునందన్ రావు.
వేసవి సెలవులు ముగిసిన తర్వాత కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టెండర్ దక్కించుకున్న ఐఆర్బి సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు రఘునందన్ రావు. ఇక ఇప్పటికైనా ఓఆర్ఆర్ టెండర్లపై ప్రభుత్వం స్పందిస్తుందో..? లేదో..? వేచి చూడాలి.