తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో మాగం రంగారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు రవిప్రసాద్ గౌడ్ తొలి దరఖాస్తు అందించారు.
జనగామ నుంచి జగదీష్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో జాతీయ నాయకత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తైన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 17 తరువాత బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.