ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన బీజేపీతోనే: ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ, జనసేన అంతా బీజేపీతోనే ఉన్నాయని..బీజేపీని జగన్, చంద్రబాబు ఒక్క మాట కూడా అనరని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరణ్ కుమార్. ఆదివారం సీఎం కేసీఆర్ తో జరిగిన భేటీ గురించి మీడియాతో మాట్లాడారు. బీజేపీది కాంగ్రెస్ ముక్త్ భారత్ కాదని, ఆపోజిషన్ ముక్త్ భారత్ అని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ వల్ల మరిన్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని ఆరోపించారు. బీజేపీపై నాకు ద్వేషం లేదని వారి విధానాలనే విమర్శిస్తున్నానని అన్నారు. 

ఆర్ఎస్ఎస్ అంటే నాకేం కోపం లేదని అన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిరసనల వల్ల భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుందని.. ఇప్పుడున్న రోజుల్లో మరింతగా సీట్లు తగ్గే అవకాశం ఉందని అన్నారు. మోదీ దేశాన్ని రాజులా పరిపాలిస్తున్నారని విమర్శించారు.  ప్రపంచ దేశాల్లో మనకు మంచి విలువ ఇస్తున్నారని.. ఇలాగే మతోన్మాదంతో వ్యవహరిస్తే మన దేశం విలువ తగ్గుతుందని ఆయన అన్నారు. బీజేపీకి ఏపీలో పెద్దగా ఓట్లు వచ్చే పరిస్థితి లేదని అన్నారు.