తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30వ తేదీన పోలింగ్.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సంసిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే బహిరంగ సభలు, రోడ్ షోలకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులుకు ఈనెల 15వ తేదీన సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు.
మరోవైపు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ఆరోజున కేసీఆర్.. గజ్వేల్, కామారెడ్డి.. రెండు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే ముందు సీఎం కేసీఆర్.. 9వ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ వేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డికి వెళ్లి అక్కడ మరో నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.