రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం దిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఆయన పాల్గొననున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తినకు వెళ్తారు. ఈ భేటీలో రాష్ట్రంలో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకుగాను రెండు విడతల్లో తొమ్మిది మంది అభ్యర్ధుల్ని ప్రకటించారు. హైదరాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చిన రాష్ట్ర నేతలు దిల్లీలో ఇవాళ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు దాదాపు ఖరారు అయ్యినట్లు సమాచారం.