అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రెండంకెల సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను దింపింది. బలమైన అభ్యర్థులు లేరని భావించిన స్థానం కోసం ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకుని మరీ సీట్లు ఇచ్చింది. ఇక మొన్నటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు.
ఇందులో భాగంగానే నేడు భువనగిరి లోకసభ నియోజకవర్గ ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమీక్ష సమావేశంలో భువనగిరి లోకసభ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేలు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలతోపాటు ముఖ్యనాయకులు హాజరవుతారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కోఆర్డినేటర్లు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.