రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. వాన వల్ల యంత్రాలపై పనిచేయడం కష్టతరంగా మారింది. గనుల్లోని రోడ్లు బురదమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. కొత్తగూడెం ఏరియాలోని మూడు ఉపరితల గనుల్లో 15 వేల టన్నులు, మణుగూరు ఏరియాలోని రెండు ఉపరితల గనుల్లో 15 వేల టన్నులు, ఇల్లందు ఏరియాలోని మరో రెండు ఉపరితల గనుల్లో 7 వేల టన్నుల మేరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో రెండో షిఫ్ట్‌లో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది. ఈరోజు రాత్రికి వర్షం తగ్గుముఖం పడితే రేపు ఉదయం నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు యథావిధిగా ప్రారంభమవుతాయని సింగరేణి అధికారులు తెలిపారు.