నేడు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా “సత్యాగ్రహ దీక్ష” పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని నీరుగార్చాలని.. ఉచిత విద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ఈ మోసాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని మండల కేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు రేవంత్ రెడ్డి.