రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన విజయభేరి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రైతుభరోసా పథకాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం తెచ్చిందని.. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చిందని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని.. సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదని.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని స్పష్టం చేశారు.
‘మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్‌గా మారింది. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే. పైకి విమర్శలు చేసుకునే మోదీ, కేసీఆర్ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉంది. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చక్కగా అబద్దాలు చెప్పారు. పదేళ్లుగా దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రధానులు ఎన్నో భారీ సంస్థలు నెలకొల్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను దీవించాలి.’ అని మల్లికార్జున ఖర్గే అన్నారు.