రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట టీఎస్పీఎస్సీ ఆఫీస్ నుంచే క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని భావించిన సిట్ అధికారులు ప్రస్తుతం విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. పరీక్ష కేంద్రం నుంచి కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు వెల్లడి కావడంతో నివ్వెరపోతున్న సిట్ అధికారులు… ఇంకా ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయన్న దానిపై దృష్టి సారించారు.
ఈ కేసులో విద్యుత్తుశాఖ డీఈఈ పూల రమేశ్ ముఠా జనవరి, ఫిబ్రవరిలలో జరిగిన ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ చేయించిన వ్యవహారం బయటపడడంతో ఈ ముఠా పూర్వాపరాలపై సిట్ మరింత లోతుగా విచారిస్తుంటే కొత్త విషయాలు తెరపైకొస్తున్నాయి. డీఈఈ రమేశ్ జనవరిలో జరిగిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్ పరీక్ష సమయంలోనూ మాస్‌కాపీయింగ్ చేయించేందుకు ప్రయత్నించినట్లు, సాంకేతిక కారణాల వల్ల అది విఫలమైనట్లు తెలిసింది.ఏఈ ప్రశ్నపత్రాల్లో సమాధానాలు వెతికేందుకు సహకరించిన ఏడుగురికి రమేశ్ ఒక్కొక్కరికి రూ.10,000 ఇచ్చినట్టు తాజాగా వెలుగు చూసింది.