మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడు: ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ టూర్ పై చర్చించారు. 

ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ టూర్ పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మేము మోదీకి ఎందుకు సన్మానం చేయాలి… ఎందుకు రిసీవ్ చేసుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని ఆయన అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాకతీయ సామ్రాజ్యం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కులాలను పట్టి ప్రజలు ఓట్లు వేయరని.. డెవలప్మెంట్ చూసి ఓట్లు వేస్తారని ఎర్రబెల్లి అన్నారు. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఐఎస్బీలో భద్రత ఏర్పాట్లను హైదరాబాద్ సీసీ సీవీ ఆనంద్ పరిశీలించారు.