మహానిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం పూర్తైంది. ఇక ఈరోజు మిగతా ప్రాంతాల్లోని గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పహారా కాస్తున్నట్లు చెప్పారు.
సుమారు 40వేల మంది పోలీసులు, 20,600 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 125 ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్‌ఏఎఫ్, పారా మిలటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం, తాగునీటి వితరణ, ఇతర సేవా కార్యక్రమాల్లో పది వేలకుపైగా జీహెచ్‌ఎంసీ, జలమండలి సిబ్బంది పాల్గొననున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద ఈ సారి 70వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని, వీక్షించేందుకు నాలుగు లక్షల మంది భక్తులు హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరమంతా ఎదురు చూసే ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి నిమజ్జనం గురువారం మధ్యాహ్నం రెండు గంటల్లోపు పూర్తవుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.