కిందా మీదా పడి ఎలాగో సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన జనం సెలవులు పూర్తి కావడంతో ఇక తిరుగుపయనమవుతున్నారు. అయితే వెళ్లడానికి ఎన్ని ఆపసోపాలు పడాల్సి వచ్చిందో తిరిగి రావడానికీ తిప్పలు తప్పడం లేదు. తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మంగళవారం నుంచే తిరుగు ప్రయాణాలు షురూ అయ్యాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లినవారు ఇవాళ హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు 18వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో నెమ్మదిగా అంతా ఊళ్ల నుంచి తిరుగుపయనమవుతున్నారు. ఖమ్మం, భద్రాచలం, కోదాడల నుంచి వచ్చే బస్సుల్లో బుధవారం దాదాపు రిజర్వేషన్లన్నీ పూర్తయ్యాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, విజయవాడ, నెల్లూరుల నుంచి 17న వచ్చే బస్సుల్లో సీట్లు లేవని చెప్పారు.
తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సర్వీసుల్లో ఏసీ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు 16, 17 తేదీల్లో బస్సులన్నీ రిజర్వేషన్లతో నిండిపోయాయని.. దీంతో ఏపీలోని ఏలేశ్వరం డిపో నుంచి 17న రాత్రి ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏపీఎస్‌ఆర్టీసీ నడపనున్నట్లు తెలిపారు.