నేటి తరం యువత చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ప్రేమించిన వాళ్లు వదిలిపెట్టారని, అమ్మానాన్న తిట్టారని ఇలా సిల్లీ కారణాలతో అర్ధాంతరంగా వారి నూరేళ్ల జీవితాలను ముగిస్తున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లేస్‌మెంట్ రాలేదనే మనస్తాపంతో ఆ విద్యార్థి బలవన్మరణం చేసుకున్నాడు.
పేట్ బషీరాబాద్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఎం.డి.మహ్మద్ (22) మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ 4వ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే ఓ హోస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. అయితే ఫోర్త్ ఇయర్ కావడంతో చదువు అయ్యేలోగా జాబ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంతకాలంగా ప్లేస్‌మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా తనకు ఉద్యోగం వచ్చేలా లేదని తోటి స్నేహితులతో తరచూ అంటుండే మహ్మద్ మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రోజున కూడా కాలేజ్ క్యాంపస్ సెలెక్షన్లలో ఎంపికవ్వలేదు. అదే రోజు సాయంత్రం గదిలో ఉంటున్న స్నేహితులు బయటకు వెళ్లి, రాత్రి 11 గంటల ప్రాంతంలో వచ్చి చూసేసరికి మహ్మద్ ఉరేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.