నిర్మల్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ మధ్య ఇంద్రకరణ్ రెడ్డి పక్కనే ఉండే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు నిర్మల్ జిల్లా నేత శ్రీహరిరావు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉండి ఆయనతో పాటు నడిచిన శ్రీహరిరావుకు 2014లో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు.
అయితే 2014 లో నిర్మల్ నియోజకవర్గంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి ఎలాంటి పట్టు లేకున్నా సొంత బలంతో ఐకే రెడ్డి గెలవడం, అనంతరం బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. కానీ బీఆర్ఎస్ తో ఉద్యమ కాలం నుంచి ఉన్న శ్రీహరిరావుకు 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. అయినా ఐకేరెడ్డికి సపోర్టుగానే ఆయన ప్రచారం చేశారు. ప్రస్తుతం పార్టీలో అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ లో ఆయన చేరినట్లు తెలుస్తోంది. నిర్మల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మామాడ, నిర్మల్ పట్టణం, తదితర మండలాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది.
మరో వైపు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రోజూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని చెబుతూ ముందుకు సాగుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. ఎన్నికలకు ఎక్కువ రోజులు సమయం లేకపోవడంతో పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే గెలుపు బాట పట్టాలంటే చేయాల్సిన ప్రయత్నాలు ముగ్గురు నేతలు చేపట్టారు.
ఉద్యమకారులను అన్యాయం జరుగుతోందని శ్రీహరిరావు, బీజేపీతోనే న్యాయం జరుగుతుందని మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ది నిర్మల్ డెవలప్ మెంట్ సాధ్యమని ప్రచారం చేయడం ప్రారంభించారు. వీరు వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే మాత్రం శ్రమించాల్సిందే.