బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముందుగా ఈ ప్రస్థానాన్ని మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం బీఆర్ఎస్ సిద్ధాంతాలతో జాతీయ స్థాయిలో ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికలోత ముందుకెళ్తున్నారు.
భారత్ రాష్ట్ర సమితి ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధి, కార్యాచరణ మహోన్నతమైనదని.. ఆక్రమంలో లక్ష్యం నుంచి ఎవరూ తప్పుకోవద్దని దిశానిర్దేశం చేశారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. పార్టీనే ముఖ్యమన్నారు. పదవులు వచ్చేవరకు పాదాలు పట్టుకొని ప్రార్థించి పదవిరాగానే కళ్లునెత్తికిపోయే పరిస్థితి బీఆర్ఎస్లో ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశాన్ని మలుపు తిప్పే అవకాశం తెలంగాణ తర్వాత మహారాష్ట్రకే వచ్చిందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకం దాదాపు పూర్తైందన్న కేసీఆర్.. రెండు మూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల 10 నుంచి జూన్ 10 వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.