షాద్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. బంగారం దొంగతనం కేసులో దళిత మహిళను షాద్ నగర్ పోలీసులు అత్యంత కిరాతకంగా కొట్టారు. థర్డ్ డిగ్రీనీ ఉపయోగించారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బాధితురాలును పరామర్శించారు. అనంతరం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
దళిత మహిళ విషయంలో పోలీస్ అధికారులు బరితెగించి వ్యవహరించారని సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోలేదని.. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఘటనకు బాధ్యులైన ప్రతీ ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము కూడా ఈ ఘటన పై మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళను చితకబాదిన కేసులో డీఐ రాంరెడ్డిని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. డీఐ తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్స్ ని కూడా సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు.