జమిలీ ఎన్నికలపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా ప్రధాన అడ్డంకిగా ఉన్న అసెంబ్లీలు, పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టి.. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామం అని తెలిపారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా.. ధ్వనికాలుష్యం, ట్రాఫిక్ జామ్ ల కారణంగా ప్రజలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థికంగా చాలా భారం పడుతోంది. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అవుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటే అని వెల్లడించారు. మరోవైపు, దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం స్పష్టంగా ఉందని వివరించారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కేవలం జాతీయ సమస్యలపైనే చర్చ జరుగుతున్న మాట వాస్తవం అన్నారు. అందుకే.. జమిలీ ఎన్నికల ద్వారా.. జాతీయ అంశాలతోపాటుగా.. ప్రాంతీయ సమస్యలపైనా సమాన స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా.. ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగి.. ఓటరు శాతం తగ్గటం స్పష్టంగా కనబడుతోంది. దీనికి జమిలీ ఎన్నికలు ఓ పరిష్కారాన్ని చూపుతాయని భావిస్తున్నానన్నారు.