నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహ‌నాలు

-

హైదరాబాద్‌ నగరంలో నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహ‌నాలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్ నల్ల చెరువు వద్ద నిర్మించిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను (ఎఫ్ఎస్టీపీ) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలతో కలిసి పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం జ‌ల‌మండ‌లి ఆధ్వర్యంలో నడిచే ‘డ‌య‌ల్ ఏ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్’ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డ‌య‌ల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టడం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. నాగ‌రిక‌మైన ప‌ద్ధ‌తుల్లో ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు జీవించాలని.. పరిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో మ‌న పిల్ల‌లు ఉండాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తుందన్నారు. మానవ వ్య‌ర్థాల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో శుద్ధి చేయ‌క‌పోతే రోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉందని, ఆ వ్య‌ర్థాల‌ను శాస్త్రీయమైన ప‌ద్ద‌తుల్లో శుద్ధి చేయాల‌న్నారు.

నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని చెరువులు, కాల్వ‌ల్లో మాన‌వ వ్య‌ర్థాలు క‌ల‌వ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్ర‌య‌త్న‌మ‌ని, వినూత్న ఆలోచ‌న‌లు అమ‌లు చేస్తూ క్లీన్ హైద‌రాబాద్ కోసం పాటుప‌డుతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. మిగ‌తా న‌గ‌రాల‌కు హైద‌రాబాద్ ఆద‌ర్శంగా నిలిచింద‌ని, నగరంలో 71 చోట్ల ఎఫ్ఎస్టీపీల‌ను నిర్మిస్తున్నామని, త్వ‌ర‌లో మ‌రో 68 నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నూత‌న వాహ‌నాల్లో ప‌రిమిత‌మైన ఛార్జీల‌తో మాన‌వ వ్య‌ర్థాల‌ను త‌ర‌లిస్తార‌ని, పేద ప్ర‌జ‌లు ఉండే చోట త‌క్కువ ఛార్జీల‌ను నిర్ణ‌యించామ‌ని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news