డిపాజిట్ కోల్పోయిన బిగ్గెస్ట్ జూటా పార్టీ (BJP)తో మేం ఎందుకు జతకడతాం : కేటీఆర్

-

నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన రహస్యం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వైఖరి మారిపోవడంతో సీఎం కేసీఆర్ దిల్లీ వచ్చి.. తనను కలిశారని మోదీ చెప్పారు. అంతే కాకుండా.. తెలంగాణ పాలనా పగ్గాలు కేటీఆర్​కు ఇస్తానని చెబితే.. ఇది రాజరికం కాదని కేసీఆర్​కు తేల్చి చెప్పానని అన్నారు. ఎన్డీఏలో చేరుతానని వెంటపడినా… తాను అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. మోదీ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ విషయాన్ని వెంటనే తిప్పికొట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోసారి ట్విటర్ వేదికగా స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎన్నో విజ్ఞప్తులు వచ్చినా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. విపక్షాలు మాత్రం కేసీఆర్ ను ఓడించేందుకు తమ సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి మరీ కలిసి పని చేశాయని అన్నారు. బీఆర్ఎస్​తో కలిసి పనిచేసేందుకు సిద్దమని 2018లో బిగ్గెస్ట్ జూటా పార్టీ ( భాజపా ) రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంకేతాలు పంపారని.. దిల్లీ బాస్​లకు అనుమతి లేకుండా లక్ష్మణ్ అలా మాట్లాడారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ప్రతిపాదనను బీఆర్ఎస్ మరుక్షణమే తోసిపుచ్చిందని చెప్పారు.

‘తప్పుడు కథనాలు అల్లుతోన్న రాజకీయ పర్యాటకులు వీటి గురించి తెలుసుకోవాలి. 105 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీతో బీఆర్ఎస్ ఎందుకు జత కడుతుంది? సొంతంగా జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకునే బలం బీఆర్ఎస్​కు ఉన్నప్పుడు బీజేపీ మద్దతు ఎందుకు ? మేము పోరాడేవాళ్లం తప్ప మోసం చేసే వాళ్లం కాదు’ అని కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version