బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బైపోల్ ఎక్కడ జరిగినా బిజెపి గెలిచిందని.. బిజెపి లేనిచోట్ల అధికార మదం, డబ్బు మదంతో బిఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. అంతే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడా లేదన్నారు. బిజెపి కార్పొరేటర్ మీద కేసులు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
గజ్వేల్ లో చత్రపతి శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేశారని నిందితుడిని అప్పగిస్తే వారిపైనే తిరిగి కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తమపై ఎన్నో ఆరోపణలు చేస్తుందని.. ఆ ఆరోపణలకు మాటలతో కాదు చేతులతో చూపిస్తామన్నారు. రాబోయే ఎన్నికలలో కెసిఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు ఈటెల రాజేందర్.