మెడికల్‌ కాలేజ్ పీజీ సీట్లలో ₹100 కోట్లకు పైగా స్కామ్!

-

రాష్ట్రంలో మెడికల్‌ కళాశాల పీజీ సీట్ల స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో దాదాపు ₹100కోట్లకుపైగా స్కామ్‌ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2016-22 మధ్య కొన్ని వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు బ్లాక్‌ చేసి.. అధిక ధరలకు అమ్ముకున్న ఆరోపణలపై గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రైవేటు వైద్యకళాశాలలకు సంబంధించి 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

మల్లారెడ్డి వైద్య కళాశాలతో పాటు ఇతర వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో భారీగా నగదు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. నిధులను యాజమాన్యం సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల యాజమాన్యాలకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థి.. మరో కళాశాలలోనూ చివరి విడత కౌన్సెలింగ్‌ వరకు సీటు బ్లాక్‌ చేయడమే ఈ దందాలో కీలకం. అలా చివరి వరకు ఆ సీటు బ్లాక్‌ అయి ఉండటంతో మిగిలిన విద్యార్థులు ఆ సీటు పొందే అవకాశం ఉండదు. అలా మిగిలిపోయే సీటును కళాశాల నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని సీట్లను విక్రయించారనేది కొన్ని ప్రైవేటు కళాశాలలపై కాళోజీ వర్సిటీ వర్గాలు మోపిన అభియోగం. పెద్దమొత్తంలో దందా జరిగిందని అనుమానించి వరంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version