రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు జిల్లాల పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కేటీఆర్ నిర్మల్ జిల్లా పర్యటన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యవేక్షించి… అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మల్ నియోజకవర్గ పరిథిలోని పోచంపాడు వద్ద ఆయిల్‌ఫామ్ ప్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
జగిత్యాల జిల్లా నూకపల్లి శివారులో 2 వందల80 కోట్లతో నిర్మించిన 3వేల7వందల20 రెండు పడక గదుల ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నారు. అలాగే 38 కోట్ల 40 లక్షలతో నిర్మించిన సమీకృత పోలీసు కార్యాలయాన్ని, నాలుగున్నర కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో దాదాపు 9 కోట్లతో నిర్మించిన మాతశిశు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ధర్మపురి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించనున్నారు.