వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ మంత్రి సీతక్క. మిషన్ భగీరథ పై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైనటువంటి రిజర్వాయర్ల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిలువలపై సమక్షించారు. రిజర్వాయర్లు మరియు నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గుడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు.
ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితంగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. పైపులైన్లు పగిలిపోయిన లీకైన వెంటనే వాటిని సరిదిద్దు నీటి సరఫరాను అదే రోజు పునరుద్ధరించాలి ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో తాగునీటి అవసరాల నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయి అవసరాలను గమనించి జాగ్రత్తగా వినియోగించుకోవాలని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని గౌరవ మంత్రివర్యులు సూచించారు.