మానేరు వాగుపై వంతెన కూలిన ఘటన.. నాణ్యతపై విచారణకు ఆదేశించిన మంత్రి శ్రీధర్‌

-

పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాల మధ్య గాలి దుమారానికి కుప్పకూలిన ఓడేడు వంతెన ఘటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ ఘటనలో బ్రిడ్జి నాణ్యతపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు వాగుపై తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన వంతెన గ్రడ్డర్లు సోమవారం అర్ధరాత్రి భారీగా వీచిన ఈదురు గాలులకు కుప్పకూలింది.

ఇవాళ తెల్లవారుజామున అటుగా వెళ్లిన వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే ఇరుగు పొరుగు జిల్లాల మధ్య దూరం తగ్గుతుందని స్థానికులు భావించారు.

“తొమ్మిదేళ్లుగా అరకొర పనులతో నిర్మాణంలో ఉన్న మానేరు వాగు వంతెన ఇవాళ కూలిపోయింది. దీనికి నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం కారణం కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో కాంగ్రెస్​ వాళ్లు లొల్లిపెట్టుకుంటున్నారని అంటున్నారు. మరి దీనికి వారేం సమాధానం చెబుతారు. నాణ్యతా లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్​లకు మేలు చేయాలని, నాటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయమే ఇవాళ్టి సంఘటనకు కారణం.” – శ్రీధర్​ బాబు, ఐటీ మంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version