రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరాఫరాల నీతిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీ లపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్తం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు.
ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీలో దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి. పారదర్శకంగా విధులు నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ స్వీకరించాలి. ఈ పరిస్థితుల్లో కూడా దరఖాస్తులను తిరస్కరించవద్దని సూచించారు. కొత్త రేషన్ కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈనెల 29న మేడిగడ్డ ప్రాజెక్టుని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.