ములుగు బహిరంగ సభలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. గాంధీ ఫ్యామిలీ వచ్చి.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వారి తెలంగాణ… వీరి తెలంగాణ అంటూ…. రాష్ట్రాన్ని విడగొట్టేలా మాట్లాడారంటూ విమర్శించారు. లక్ష కోట్ల లోపు ప్రాజెక్టుల్లో…. లక్ష కోట్ల అవినీతి సాధ్యమవుతుందని కవిత ప్రశ్నించారు.
కమీషన్లు తీసుకుంటే చెరువుల్లోకి నీరు కాకుండా… రైతుల కంట కన్నీరు వచ్చేదని కవిత తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి, 24 గంటల కరెంటు దూరమవుతుందని చెప్పారు. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుందని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. సింగరేణి గనులను మూసేసి కార్మికులకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. తాడిచర్ల మైన్‌ను కాంగ్రెస్ ప్రైవేటుకు ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని సింగరేణి కార్మికులు నిలదీయాలని సూచించారు. సింగరేణిని నాశనం చేసి.. కార్మికుల బతుకులను అంధకారంలోకి నెట్టేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ పథకాలను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్న కవిత.. మూడోసారి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.