కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరుగెడుతుంది. గత కొద్ది రోజుల నుంచి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులలోకి భారీ వరదలు వస్తుండటంతో ఇటీవలే శ్రీశైలం గేట్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. నిన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన గేట్లను కూడా ఎత్తారు. తొలుత 4 గేట్లు నిన్న సాయంత్రం వరకు మొత్తం 20 గేట్లను ఎత్తారు. ఆ తరువాత ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 22 గేట్లను ఎత్తారు.
సాగర్ కు భారీ వరద వస్తుండటంతో గేట్లను వదలడంతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఈ తరుణంలో సాగర్ ఎడమ కాలువలో నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో అనుముల మండలం మారెపల్లి వద్ద లో లేవల్ కాలువకు గండి పండింది. దీంతో కాలువలోని నీరు అంతా భారీగా పొలాల్లోకి చేరింది. విషయం తెలుసుకున్న అధికారులు ఎడమ కాలువను మూసేసారు. కాలువ మరమ్మతులు చేశాక తిరిగి ఎడమ కాలువ ద్వారా నీటిని దిగువకు వదలనున్నట్టు సమాచారం. ఈ గండితో సాగర్ జలాలన్నీ వృధా అయ్యాయి.