దేశ వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది. ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఇక్రా నివేదిక తెలిపింది. ‘అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీల వద్ద నికరంగా పెట్రోల్ లీటర్ కు రూ. 11, డీజిల్ పై లీటర్ కు రూ. 6 ఎక్కువగా ఉంది.
2023, సెప్టెంబర్ లో భారీగా క్షీణించిన తర్వాత గత కొన్ని నెలల్లో పెట్రోల్ మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. 2023, అక్టోబర్ వరకు డీజిల్ మార్జిన్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి సానుకూలంగా మారాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నట్లయితే దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలు తగ్గించే వీలుందని’ ఇక్రా గ్రూప్ హెడ్ గిరీష్ కుమార్ కదమ్ వివరించారు. ప్రస్తుతం బెంచ్ మార్క్ క్రూడ్ ధరలు బ్యారెల్ కు 80 డాలర్ల కంటే తక్కువగానే ఉన్నాయి.