తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు.. అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేసుకున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ నేతలను తరచూ రాష్ట్రానికి తీసుకువస్తోంది. అయితే కర్ణాటక ఫలితాలతో అప్రమత్తమైన బీజేపీ తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది.
అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అగ్రనేతలు వరుసగా పర్యటించనున్నారు. ఇప్పటికే నడ్డా, అమిత్‌షా పర్యటలు ఖరారు కాగా…. త్వరలోనే ప్రధాని మోదీ సైతం రాష్ట్రానికి రానున్నారు. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌లో ప్రధాని రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉంది. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో J.P.నడ్డా, అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే సభకు అమిత్ షా హాజరవుతారు. అలాగే… 25న నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగే బీజేపీ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.