ఎండలతో భగభగలాడిపోతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రోజున ఖమ్మం, మెదక్ మినహా అన్నిచోట్లా సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.